సాఫ్ట్వేర్ రంగంలో ఉజ్జ్వల భవిష్యత్తు…
సాఫ్ట్వేర్ రంగంలో ఉజ్జ్వల భవిష్యత్తును ఆశిస్తున్న వారికి శుభవార్త. ఈ రంగానికి మరింత ప్రోత్సాహం కల్పించేలా జాతీయ సాఫ్ట్వేర్ విధాన ముసాయిదాను కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. సాఫ్ట్వేర్ రంగానికి విధాన ముసాయిదా విడుదల చేయడం ఇదే తొలిసారి. 2025 నాటికి సాఫ్ట్వేర్ రంగం కొత్తగా 35 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేలా చూడాలన్నది ముసాయిదా లక్ష్యం.
సాఫ్ట్వేర్ ఉత్పత్తులే కీలకం
దేశీయ ఐటీ పరిశ్రమ 143 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినా, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల విభాగాదాయం 6.1 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇందులోనూ 2 బిలియన్ డాలర్లు ఎగుమతుల నుంచే వస్తున్నాయి.
అంతర్జాతీయ విపణిలో దేశీయ సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వాటాను 10 రెట్లు పెంచి రూ.10 లక్షల కోట్ల (148 బిలియన్ డాలర్ల) విభాగంగా తీర్చిదిద్దాలన్నది ప్రణాళిక. ఇందుకోసం దేశీయ, అంతర్జాతీయ విపణులకు సాఫ్ట్వేర్ ఉత్పత్తులు సులభంగా చేరేలా చూడాలని ముసాయిదా నిర్దేశించింది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉత్పత్తుల విపణి అంతర్జాతీయంగా 411 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.28 లక్షల కోట్ల) స్థాయిలో ఉందని, 2025 నాటికి లక్ష కోట్ల డాలర్ల (రూ.68 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ ఉత్పత్తుల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. 2025 నాటికి దేశీయ ఐటీ పరిశ్రమ 350 బిలియన్ డాలర్ల (రూ.23.80 లక్షల కోట్లు) స్థాయికి చేరుతుందన్నది నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) అంచనా.
ఈ రంగాల్లో వినియోగం పెంచుతాం
ఇందుకోసం తానేమి చేస్తుందో కూడా ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ సేకకరణ విధానంలో సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు భాగం కల్పిస్తామని పేర్కొంది. రక్షణ, అణు ఇంధన, అంతరిక్ష, విమానయానం, రైల్వేలు, టెలికమ్యూనికేషన్, విద్యుత్తు, ఆర్యోగ సంరక్షణ రంగాల్లో సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచే చర్యలు తీసుకుంటామని, ప్రోత్సహిస్తామని తెలిపింది. కొత్త సంస్థ స్థాపన, నిర్వహణను సులభతరం చేయడంతో పాటు సాఫ్ట్వేర్ ఉత్పత్తుల రంగానికి ప్రత్యేకమైన సమస్యలుంటే, పరిష్కారానికి మంత్రివర్గ సంఘం కృషి చేస్తుంది. అత్యున్నత సాఫ్ట్వేర్ ఉత్పత్తుల అభివృద్ధి కోసం 2025 నాటికి 10 లక్షల మంది నిపుణులను సిద్ధం చేసే ప్రక్రియ చేపట్టాలని సాఫ్ట్వేర్ విధాన ముసాయిదా సూచించింది.
10,000 అంకుర సంస్థలు!
అంతర్జాతీయంగా పోటీపడే సత్తా కలిగిన సాఫ్ట్వేర్ ఉత్పత్తుల అభివృద్ధి కోసం దేశంలో కొత్తగా 10,000 సాంకేతిక అంకుర సంస్థల (స్టార్టప్స్) ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని సృష్టించాలనేది ముసాయిదా లక్ష్యం. ఇవి సాకారమైతే కొత్తగా మరో 35 లక్షల మందికి సాఫ్ట్వేర్ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించగలదని అంచనా. 2017కు 10 లక్షల ఉద్యోగాలు, 2025 నాటికి మరో 25లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ముసాయిదా ఆకాంక్ష.
Leave a Reply