చంద్రబాబు కన్వీనర్‌గా 13 మందితో నీతి ఆయోగ్‌ కమిటీ | Telugu News

చంద్రబాబు కన్వీనర్‌గా 13 మందితో నీతి ఆయోగ్‌ కమిటీ

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను   ప్రోత్సహించడానికి అవలంబించాల్సిన పద్ధతులపై దిశానిర్ధేశం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్వీనర్‌గా 13 మందితో నీతి ఆయోగ్‌ కమిటీ ఏర్పాటైంది. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, మధ్యప్రదేశ్‌ సిఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీ్‌సలతో పాటు నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియాలు సభ్యులుగా నియమితులయ్యారు. నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత సభ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఆధార్‌కార్డ్‌ సృష్టికర్త నందన్‌ నీలేకని, వివిధ రంగాల నిపుణులు జనమేయ సిన్హా, రాజేశ్‌ జైన్‌, శరద్‌ శర్మ, డాక్టర్‌ జయంత వర్మలు నియమితులయ్యారు. కమిటీ నివేదికకు మాత్రం ఎటువంటి గడువును విధించలేదు. లక్ష్యాలను సాధించే వరకూ ఈ కమిటీ పనిచేసే అవకాశం ఉందని, అవసరమైన ఉపకమిటీలను కూడా ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కూడా కమిటీకి ఇచ్చామని బుధవారం నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. సమగ్రాభివృద్ధి, సమానత్వం ప్రభుత్వ కీలక ప్రాధాన్యతలని, ఆర్థిక అసమానతలను తొలగించడమే కాకుండా ఆయా రంగాల్లో విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించడం, కొనుగోలు శక్తిని పెంచాలన్న లక్ష్యంతో కేంద్రం కీలక నిర్ణయాలను తీసుకుంటున్నదని నీతి ఆయోగ్‌ పేర్కొంది. నగదు రహిత చెల్లింపులు, లావాదేవీల కారణంగా ఆర్థికాభివృద్ధి మరింతగా పెరుగుతుందని నమ్ముతున్నామని, దీని కారణంగా వ్యవస్థలో పారదర్శకత మరింత పెరగడమే కాకుండా లోపాలను సవరించడానికి వెసులుబాటు కలుగుతుందని తెలిపింది. డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థను అమలు చేస్తూనే ప్రజల్లో అవగాహాన కల్పించాలన్న ఉదాత్త లక్ష్యాన్ని నీతి ఆయోగ్‌ తన భుజాలపై వేసుకున్నదని, డిజిటల్‌ చెల్లింపులు, లావాదేవీలకు విరివిగా వాడకంలో ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నామని పేర్కొంది. ప్లాస్టిక్‌ కార్డులు, యుఎ్‌సఎ్‌సడి, డిజిటల్‌ వ్యాలెట్‌లు, ఆధార్‌ అనుసంధానంతో చెల్లింపు వ్యవస్థ(ఏఇపిఎస్‌), యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స(యుపిఐ) వ్యవస్థలపై త్వరిత గతిన ప్రజల్లో మరింత అవగాహనకల్పించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్‌ అభిప్రాయపడింది. సమాఖ్య వ్యవస్థలో రాష్ర్టాలన్నింటినీ కలుపుకుపోయి లక్ష్యాలను సాధించాలని చెప్పింది. అందులో భాగంగానే సీఎంల కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. సీఎంల కమిటీలో భాగస్వాములు కావాలని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌లను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్వయంగా కోరారు. నితీశ్‌ కుమార్‌ పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తూ పార్టీ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తను కమిటీలో ఉండనని తేల్చిచెప్పారు. త్రిపుర ముఖ్యమంత్రికి కూడా సీపీఎం అధిష్ఠానం ఎర్రజెండా చూపింది. దీంతో వీరిద్దరి స్థానంలో ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌లకు చోటు కల్పించారు. అదనంగా ఆర్థిక రాజధాని ముంబయికి ప్రాతినిధ్యం ఇస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి సోనియాగాంధీ అనుమతి తీసుకోవాలని తెలిపారు. కమిటీలో నారాయణస్వామి పేరు చేర్చినా సమావేశాలకు ఆయన హాజరు కావడం కష్టమేనని అంటున్నారు

కమిటీ లక్ష్యాలివే
డిజిటల్‌ చెల్లింపులపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్ధతులను గుర్తించాలి. భారతదేశంలో అమలుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి.
ఏడాదిలో డెబిట్‌, క్రెడిట్‌, ప్రీపెయిడ్‌ కార్డులు, డిజిటల్‌ వ్యాలెట్‌లు/ఇ వ్యాలెట్‌లు, ఇంటర్నెట్‌ బ్యాకింగ్‌, యుపిఐ, బ్యాంకింగ్‌ యాప్‌లను బాగా విస్తరింపజేయడానికి, ప్రజలు వెనువెంటనే అనుసరించడానికి మార్గాలను సూచించాలి.
డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్థ వైపు మళ్లడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు చేయడం, వారిలో మరింత అవగాహనకల్పించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం.
ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్‌ పద్ధతిలోకి మార్చడానికి రాష్ర్టాల కార్య నిర్వహణ వ్యవస్థలు, అధికారులను ఎలా సిద్ధం చేయాలన్న దానిపై మార్గాన్వేషణ.
డిజిటల్‌ చెల్లింపుల వైపు మళ్లేందుకు గల ఇబ్బందులు గుర్తించాలి. పరిష్కారాలను సూచించాలి.
కీలక భాగస్వామ్యులను డిజిటల్‌ చెల్లింపుల దిశగా సమన్వయం చేయడం.
ఇప్పటికే ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ లాంటి కమిటీలు చేసిన సూచనలను పరిశీలించి రూపురేఖలు ఇవ్వాలి.
వేరే ఏ ఇతర సలహాలు, సూచనలైనా కమిటీ చేయవచ్చు. కమిటీ పనితీరుపై పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. టెక్నికల్‌ కమిటీలు, ఉపసంఘాలను కూడా ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కల్పించారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts