తాజా సర్వే కేసీఆర్ పాలన అద్భుతం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్ర ప్రగతి ప్రస్థానం విజయవంతమవుతుందని ప్రజానికం తేల్చిచెప్పారు! రెండున్నరేళ్ల వ్యవధిలో టీఆర్ ఎస్ ప్రభుత్వం సాధించిందేమిటి? ప్రభుత్వం చేపట్టిన పథకాలపై ప్రజల మాటేమిటి? కారు జోరు ఎలా ఉంది? మిడ్ టర్మ్ హియరింగ్ లో ప్రజల నాడి ఏమని కొట్టుకుంటున్నది? ఈ ప్రశ్నలకు ప్రజల నుంచి వచ్చిన సమాధానం.. అద్భుతం!ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే తమ ఓటు టీఆర్ ఎస్ కేనని 109 నియోజకవర్గాల ప్రజలు ముక్తకంఠంతో నినదించారు! ఇదీ.. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే సారాంశం! తాజాగా చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు మొదలుకుని.. వివిధ సంక్షేమ పథకాల అమలుదాకా.. సీఎం పని తీరు నుంచి.. స్థానిక ఎమ్మెల్యేల సామర్థ్యం దాకా.. అనేక ప్రశ్నలతో సేకరించిన అభిప్రాయాలు.. రాష్ట్రంలో టీఆర్ ఎస్ కు తిరుగులేదని స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం తమదేనని భరోసాతో ఉన్న కాంగ్రెస్ – టీడీపీ – బీజేపీలకు ప్రజలు షాక్ ఇచ్చినంత పనిచేశారు.
కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి.. యావత్ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిందని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ నిర్వహించిన అధ్యయనంలో తేటతెల్లమైంది. మిడ్ టర్మ్ హియరింగ్ పేరిట టీవీ9 చానల్ ఈ వివరాలను శుక్రవారం రాత్రి ప్రసారం చేసింది. జిల్లాల పునర్విభజనకు ముందు పది జిల్లాలను ప్రామాణికంగా చేసుకుని నిర్వహించిన ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీ ఓటు ఎవరికి? అని ప్రశ్నించగా.. 67.88% మంది టీఆర్ ఎస్ కేనని ఘంటాపథంగా తేల్చి చెప్పారని సర్వే వెల్లడించింది. టీఆర్ ఎస్ కు గత ఎన్నికల్లో 33.66% ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయా నియోజకవర్గాలవారీగా తాజా ప్రజాస్పందనను పరిశీలిస్తే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 109 స్థానాల్లో టీఆర్ ఎస్ విజయ దుందుభి మోగిస్తుందని వెల్లడైంది. అందులోనూ ఐదు జిల్లాల్లో వందశాతం అసెంబ్లీ సీట్లు టీఆర్ ఎస్ కే దక్కుతాయని తేలింది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగి ఉన్న కాంగ్రెస్కు ఆ హోదా పోవడంతోపాటు.. కనాకష్టంగా ఆ పార్టీ కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని సర్వే పేర్కొంది. హైదరాబాద్ పాతబస్తీలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న ఎంఐఎం ఏడు స్థానాలు గెల్చుకుంటుందని వెల్లడైంది. ఇక్కడ కూడా టీఆర్ ఎస్ బలం నానాటికీ పెరుగుతున్నదని సర్వే పేర్కొనడం విశేషం. ఇక వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని భావిస్తున్న టీడీపీ.. బీజేపీ – వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒకటి చేసి ప్రాభవం చాటుకోవాలని ప్రయత్నిస్తున్న వామపక్షాలు ఊసు లేకుండా పోతాయని సర్వే పేర్కొంది.
జిల్లాల పునర్విభజనకు ముందు చేసిన ఈ సర్వేలో.. దాదాపు అన్ని జిల్లాల్లో టీఆర్ ఎస్ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేశారు. పది జిల్లాలకుగాను సగం జిల్లాల్లో టీఆర్ ఎస్ ఓట్లశాతం 70శాతం పైనే ఉంటుందని తేలింది. ఇప్పటికిప్పడు ఎన్నికలు జరిగితే 22 నియోజకవర్గాల్లో 80శాతానికిపైగా టీఆర్ ఎస్ కు ఓట్లు లభిస్తాయని అందులో 9 నియోజకవర్గాల్లో 90శాతంపైనే ఓటింగ్ లభిస్తుందని సర్వే వెల్లడించింది. గత ఎన్నికల్లో బీజేపీకి 8.50% ఓట్లు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఆ ఓటింగ్ కాస్తా 3.73శాతానికి పడిపోవడంతోపాటు.. ఒకే ఒక్క స్థానంతో (గోషామహల్) సరిపెట్టుకునే పరిస్థితి కనిపిస్తున్నది. ఇక ఆ పార్టీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి గుండుసున్నాయే మిగులుతుందని సర్వే వెల్లడించింది. ఓటింగ్ శాతం పరంగా చూస్తే టీడీపీకి 4.35శాతం ఓట్లు వస్తాయని వెల్లడైంది. ఇక వైసీపీ – సీపీఎం – సీపీఐ – బీఎస్పీ వంటి పార్టీలకు అసెంబ్లీలో అడుగు పెట్టే అదృష్టం కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఇతర ప్రతిపక్ష పార్టీలకన్నా ఎంఐఎం పరిస్థితి కాస్త మెరుగ్గా కనిపిస్తున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా.. మజ్లిస్ పార్టీకి 2.44 శాతం ఓట్లతో ఏడు స్థానాలు లభిస్తాయని సర్వే వెల్లడించింది.
Leave a Reply