కార్తీక వనభోజనాల వైభోగమే వేరు
రేపే కదా కార్తీక మాసం ఆఖరి రోజు. ఈ నెల అంతా శివభక్తులు పూజలు, నోములు,వాన భోజనాలు అంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.
అయితే ఈ వాన భోజనాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.
‘వనము’ అంటే అనేక వృక్షముల సముదాయము అని అర్ధం. ముఖ్యంగా రావి, మారేడు, మఱ్ఱి,మద్ది,జమ్మి, మోదుగ, ఉసిరి, మామిడి,నేరేడు, పనస, వేప, ఇత్యాది వృక్షాలతో, తులసి, కొబ్బరి, జామ, అరటి, నిమ్మ, మొక్కలతో, రకరకాల పూల మొక్కలతో కూడివుండాలి. దాహము వేస్తే దప్పిక తీర్చడానికి ఓ మంచి నీటి సెలయేరు ఉండాలి. ఇవి ఉన్నచోట కుందేళ్ళు,జింకలు, నెమళ్ళు, చిలుకలు మొదలైన సాదు ప్రాణులు ఖచ్చితంగా ఉంటాయి. దానినే ‘వనము’ అంటారు అంతే గానీ అడవిని ‘వనము’ అనరు. ‘వనము’ అంటే, వసించడానికి అనువైన ప్రదేశము అని అర్ధం. వేటకు, క్రూరత్వానికి తావు లేనిదే ‘వనము’. అట్టి వనము దేవతా స్వరూపమే కదా… ఎందుకంటే ఈ వృక్షాలు, మొక్కలు, దేవతలకూ, మహర్షులకూ ప్రతిరూపాలు. ప్రశాంతతకు, పవిత్రతకు ఆలవాలమైన తపోభూమి ఈ వనం. నిర్భయంగా విహరించడానికి అనువైన ప్రదేశము. అలాంటి వనాలను సంవత్సరానికి ఒక్కసారైనా., ప్రత్యేకించి కార్తీకమాసంలో దర్శించండి అని మన పూర్వులు నియమం పెట్టారు. దీనిలో ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఆనందకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి.
అవి ఏమిటంటే….
– కార్తీకమాసం నాటికి… వానలు ముగిసి, వెన్నెల రాత్రులు మొదలవుతాయి . చలి కూడా అంత ఉండదు. సమశీతోష్ణ వాతావరణంతో మనసుకు ఆనందాన్ని, అత్యంత ఆహ్లాదాన్ని కలిగించేదే ఈ కార్తీకమాసం.
– ఆధ్యాత్మికపరంగా.,శివ,కేశవులకు అత్యంత ప్రీతికరమైనది ఈ కార్తీకమాసం. అందుచేత శివ, కేశవ భక్తులు ఒకచోట చేరి, ఐకమత్యంతో ఆనందంగా గడపడానికి అవకాశం కల్పించే పవిత్ర మాసం ఈ కార్తీకమాసం.
– పైన చెప్పిన వృక్షాలు, మొక్కలు, చెట్లు పచ్చగా చిగురించి ,పరిశుద్ధమైన పరిసరాలతో ఆరోగ్యకరమైన ప్రాణవాయువును ప్రకృతిలో విహరింపజేసే మాసమే ఈ కార్తీకమాసం.
పుణ్యప్రదమైన ఈ కార్తీకమాసంలో ‘సరదాగా వనవిహారం చేసిరండి’ అంటే ఎవరూ వెళ్ళరు. ఎందుకంటే ఆకలేస్తే అక్కడ వండి, వార్చి పెట్టేవారెవరు?
అందుకే ‘వనభోజనాలు’ ఏర్పాటు చేశారు మన పెద్దలు.
‘దేవుడి మీద భక్తా? లేక ప్రసాదం మీద భక్తా?’ అంటే పైకిచెప్పలేకపోయినా ‘ప్రసాదం మీదే భక్తి’ అనే రకం మనవాళ్ళు. కనీసం భోజనంమీద భక్తితో ప్రేమతోనైనా వనవిహారానికి వచ్చేవారున్నారు. “స్వార్ధంలో పరమార్ధం” అంటే ఇదే.
ఇక వనభోజనం అంటే కేవలం తిని, తిరగడమే అనుకుంటారు కొంతమంది భోజనప్రియులు కానీ దానికో పద్ధతి, నియమం ఉంది. కాలకృత్యాలు, స్నానాలు పూర్తి చేసుకున్న తర్వాత బంధుమిత్రులు, పరిచయస్తులు, ఇరుగు, పొరుగు కలిసి, జాతి, మత, కుల వివక్షత లేకుండా కుదిరితే అందరూ ఒకే వాహనంలోగానీ, లేదా రెండు వాహనాలలోగానీ వారు ఎంచుకున్న వనానికి సూర్యోదయానికి ముందే చేరుకోవాలి. ముందుగా ఒక వటవృక్షం ఎంచుకుని దాని క్రింద ఇష్టదేవతా విగ్రహాలను ఉంచి తాజా పూలదండలతో చక్కగా అలంకరించాలి.
ఆనందం నలుగురితో పంచుకోవాలంటే వంటవాళ్ళను తీసుకెళ్ళ కూడదు. మగవారు పాటలు పాడుతూ కూరలు తరుగుతుంటే ఆడవారు చీరకొంగులు నడుము చుట్టి, అందరూ తలోరకం వంట వండుతూంటే కలిగే ఆనందమే వేరు. పిల్లలంతా కలిసి చేసే అల్లరిలో ఉండే మజాయే వేరు. కన్నెచూపుల, కుర్రచూపుల చాటుమాటు కలయికలోని ఖుషీయే వేరు. కొత్తజంటల గుసగుసల తమాషాల వాడే వేరు. అనుభవంతో తలపండిన పెద్దల ఛలోక్తులు వారు అంటీ అంటనట్టు అంటించే చురకల వేడే వేరు. ఇన్నిరకాల ఆనందాల మధ్య, ఆచారాలకూ, మతాలకు,నియమాలకూ ప్రాధన్యత లేదు. అన్ని రకాల సాంప్రదాయాలకూ., సంస్కృతులకూ సమాన వేదికే ఈ వనవిహార కార్తీక వనభోజనం.
Leave a Reply