నగదురహిత లావాదేవీల అవగాహనకు తెరలేపిన ఏపీ సీఎం… | Telugu News

నగదురహిత లావాదేవీల అవగాహనకు తెరలేపిన ఏపీ సీఎం…

రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు, మొబైల్‌ బ్యాంకింగ్‌పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, బ్యాంకుల ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు బ్యాంకింగ్‌ వ్యవస్థలో జోక్యం చేసుకోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ అంశంలో ప్రభుత్వ జోక్యాన్ని ఒత్తిడిగా భావించొద్దని బ్యాంకర్లకు సూచించారు.ఆన్‌లైన్‌, మీసేవ, ఈ-పాస్‌ వంటి వ్యవస్థలను అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని.. ఈ వ్యవస్థలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

అన్ని పాఠశాలల్లోనూ బయోమెట్రిక్‌ ద్వారా హాజరు నమోదు చేయాలని కలెక్టర్లకు సూచించారు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ-పాస్‌ మిషన్ల ద్వారా రేషన్‌ పంపిణీ జరుగుతోందని.. ట్యాబ్‌లను వినియోగించి పల్స్‌ సర్వే కూడా నిర్వహించినట్లు సీఎం తెలిపారు. వచ్చే నెలలోపు రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల ఇళ్లను పైబర్‌గ్రిడ్‌తో అనుసంధానం చేస్తామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,500 మంది బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు, 29వేల మంది రేషన్‌ డీలర్లు కూడా పనిచేస్తే బ్యాంకర్లపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నగదు లభ్యత తక్కువగా ఉందని… డిసెంబర్‌ ఒకటి నుంచి నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్‌ బ్యాంకింగ్‌పై అవగాహన, శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. నగదు లోటు ఉన్నప్పటికీ అన్ని కార్యకలాపాలు, లావాదేవీలు ఆటంకాలు లేకుండా జరిగేలా చూడాలన్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts