‘పెళ్ళిచూపులు’ డైరెక్టర్ ఇదంతా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.
పెళ్ళిచూపులు’ అనే సినిమా జూలై నెల్లో తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం కోటిన్నర లోపే బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కోట్లకు పైగా వసూళ్ళు సాధించడం అందరినీ ఆశ్చర్యపరచింది. ఇక ఈ సినిమాతో పరిచయమైన దర్శకుడు తరుణ్ భాస్కర్ పేరు విడుదల తర్వాత అంతటా మారుమోగిపోయింది. ప్రస్తుతం తన రెండో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడిపోయిన తరుణ్, ‘పెళ్ళిచూపులు’ త్వరలోనే వంద రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒకసారి సినిమా విజయాన్ని తల్చుకున్నారు. “కొద్దిరోజుల క్రితం గౌతమ్ మీనన్ నాకు ఫోన్ చేసి పెళ్ళిచూపులు రీమేక్ హక్కులు తీసుకుంటున్నా అన్నారు. ఇది జరుగుతుందని నేను ఊహించలేదు. నవంబర్ 5న నా పుట్టినరోజున పెళ్ళిచూపులు 100 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఇది కూడా జరుగుతుందని నేను ఊహించలేదు. నాకు ఎప్పుడూ సపోర్ట్‌గా నిలిచిన నాన్నకు థ్యాంక్స్!” అంటూ తరుణ్ భాస్కర్ తన ఆనందాన్ని పంచుకున్నారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగులో రొమాంటిక్ కామెడీలకు మరోసారి కొత్తగా క్రేజ్ తెచ్చిపెట్టింది.
Leave a Reply