నిర్మాతగా మారి తారక్ తో సినిమా చేస్తా అంటున్న రఘు కారుమంచి
తన వైపు చూడగానే నవ్వు తెప్పించే ముఖం, దానికి తగినట్టుండే శరీరభాష అతడిని ఓ మంచి హాస్య నటుడిని చేశాయి. తెలుగులో చాలా మంది కమెడియన్లు ఉన్నా, ఎవరి ప్రత్యేకత వారిదే! వారందరి కన్నా విభిన్నమైన హాస్య నటుడు రఘు కారుమంచి. ఇతగాడి కామెడీకి కొదవలేదు, కోరికలకు అంతులేదు. ఎందుకంటే దాదాపు కమెడియన్లందరూ హీరోగా నటించాలని చూస్తుంటే ఈ కమెడియన్ మాత్రం విలన్ అవుతానంటున్నాడు.
సినిమా ప్రపంచం కాకుండా ప్రతి నటుడికి ఒక వైవిధ్యమైన ప్రపంచం ఉంటుంది అదే వారి కుటుంబం.
వాస్తవానికి రఘుది తెనాలి. కానీ ఆయన పుట్టిందీ, పెరిగిందీ అంతా హైదరాబాదులోనే. అతని నాన్న గారు ఆర్మీ వ్యక్తి. అమ్మ వంటింటి వరకే పరిమితం. బ్రదర్ ఉన్నాడు. తను బిజినెస్ చేస్తున్నాడు. నా భార్య కూడా బాగా చదువుకుంది. తను ఎం.ఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్న లక్షణమైన ఇల్లాలు. మరియు ఇద్దరు పిల్లలు.
ఎంబీఏ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేసేవాడు రఘు. దాదాపు పదమూడు సంవత్సరాల కిందటే సాఫ్ట్వేర్ రంగంలో మంచి జీతం వచ్చేది. సినిమాల పై ఉన్న మక్కువ వల్ల ఆయన అడుగులు ఇండస్ట్రీ వైపు పడ్డాయి. ఓ పక్క ఉద్యోగం చేస్తూనే చాలా సంవత్సరాలు సినిమాల్లో నటించేవారు. కానీ సినిమాలు, ఉద్యోగం రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమనిపించి ఇష్టమైన సినిమాల కోసం బంగారు గుడ్డు పెట్టెబాతులాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేశాడు మన రఘు.
ఎలాంటి శిక్షణ లేకుండానే సినిమాల్లోకి వచ్చి మంచి పేరుతెచ్చుకున్నాడు. తన మనసులో మాటలు మీడియాతో ఈ విధంగా పంచుకున్నాడు రఘు.
“నేను చాలా సినిమాల్లో విలన్ పక్కన కమెడియన్ పాత్రలు చేశాను తప్ప పూర్తి స్థాయి విలన్‌గా చేయలేదు. ఎవరైనా అవకాశం ఇస్తే పూర్తిస్థాయి విలన్‌గా నటించాలని ఉంది. కమెడియన్‌గా చాలా సంతోషంగా ఉన్నాను.
ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. చాలా సంవత్సరాలుగా సురేందర్ రెడ్డి గారూ,వి.వి.వినాయక్ గారూ, నేనూ మంచి స్నేహితులం. అప్పుడే వాళ్ళిద్దరూ సినిమాల్లో పైకి వస్తున్నారు. నన్ను కూడా రమ్మన్నారు. కమెడియన్‌గా నాకు మంచి భవిష్యత్తు ఉందని ముందు ఊహించింది వారిద్దరే! వాళ్ళు అడుగుతూ ఉన్నంత కాలం నేనే వస్తాను… వస్తాను అంటూ కాలయాపన చేసేవాడిని. చివరికి వి.వి.వినాయక్ 2002లో ‘ఆది’లో నాకొక పాత్ర ఇచ్చారు. ఆ సినిమా సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నాకు ఇచ్చిన సపోర్ట్ ఎన్నటికీ మరిచిపోలేను. ఆయనతోనే ఎక్కువ సినిమాలు చేశాను. ఎప్పటికైనా నిర్మాతగా మారి ఆయనతో ఓ సినిమా చేయాలని నా కోరిక. అది ఎప్పటికైనా తీరుతుందన్న నమ్మకం నాకుంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఈ వేషాలు మానేసి బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించేది. కమెడియన్‌గా సక్సెస్ అయ్యాక ఇప్పుడు ఉద్యోగం గుర్తుకు రాదు.” అంటూ తన సినీ ప్రయాణాన్ని షార్ట్ కట్ లో చెప్పేశాడు రఘు కారుమంచి. ఎప్పటికైనా ఆయన కోరిక నెరవేరాలని కోరుకుందాం.
Leave a Reply