నుజ్‌హత్ పర్వీన్ కల నిజమాయెగా..
సింగ్రౌలి(మధ్యప్రదేశ్): ఐదేండ్ల ముందువరకు తను అనుకోలేదు క్రికెటర్‌గా మారగలనని.. అనుకోకుండా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఇప్పుడు 20 ఏండ్ల వయసులో భారత మహిళల టీ20 జట్టులో చోటు దక్కించుకొని తన కల నిజం చేసుకుంది. ఆ అమ్మాయే నుజ్‌హత్ పర్వీన్. అందరికీ కుష్బూగా తెలిసిన నుజ్‌హత్ పట్టుదలకు మారుపేరుగా నిలిచింది. ఈనెల 18నుంచి వెస్టిండీస్‌తో జరుగబోయే రెండుమ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడే భారత జట్టుకు నుజ్‌హత్ ఎంపికైంది. అంతేకాదు ఈనెల 27 నుంచి జరుగనున్న ఆసియాకప్‌లో జాతీయ మహిళా జట్టులోనూ వికెట్‌కీపర్‌గా ఎంపికైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా డివిజన్ నుంచి ఓ మహిళా క్రికెటర్ దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఇదే మొదటిసారి.
కెరీర్‌ను సీరియస్‌గా తీసుకుని శ్రమించడంతోనే ఈ స్థాయికి చేరుకున్నట్లు నుజ్‌హత్ చెప్పింది. ఐదేండ్ల ముందు నేను క్రికెటర్ కావాలని అసలు ఆలోచించలేదు. అనుకోకుండా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాను. డివిజనల్ క్రికెట్ అసోసియేషన్ (డీసీఏ) స్ఫూర్తితో దేశానికి ప్రాతినిథ్యం వహించేలా ఎదిగాను అని నుజ్‌హత్ మీడియాకు వివరించింది. సోదరులు విదేశాల్లో ఉంటుండగా నుజ్‌హత్ తండ్రి నార్తర్న్ కోల్‌ఫీల్డ్ లిమిడెట్‌లో ఉద్యోగి. డీసీఏ అండర్-19 జట్టులో విశేషంగా రాణించడంతోపాటు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ టీ20 టోర్నీలోను ఆకట్టుకోవడంతో నుజ్‌హత్ భారత జట్టులో చోటు దక్కించుకుంది. నుజ్‌హత్ ప్రస్తుతం భారతీయ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నది.
Leave a Reply