పసుపు చొక్కాల వల్ల కుమ్ముకుంటున్న కారు మబ్బులు
తెలంగాణా రాష్ట్రం ఏర్పడి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు గారు తన రాజకీయ బలంతో ముఖ్యమంత్రిగా సంస్థానాన్ని స్థాపించిన విషయం అందరికీ తెలిసినదే.
అయితే ఆపరేషన్ ఆకర్షణ పేరుతో చాలా మంది పసుపు చొక్కా బాబులను సైకిల్ దింపి తన కార్ ఎక్కించుకుని గులాబీ గూటికి చేర్చారు.
ఇలా గులాబీ గూటికి చేరిన సైకిల్ బాబులకు కూడా తెరాసా పార్టీ బాధ్యతలు అప్పగించాలిగా. అదే చేశారు తెలంగాణ సీఎం కెసిఆర్. వేరే పార్టీ నుండి వచ్చిన నేతలకి ప్రాధాన్యం ఇస్తుంటే ముందు నుండి అదే పార్టీ లో ఉన్న నేతలకి చిర్రెత్తుకొస్తుంది. పైగా ఇరువురు నాయకులూ వేరే పార్టీలలో ఉన్నప్పుడు ఒకరినొకరు చాలా సందర్భాలలో అసభ్యకర పద జాలంతో పరస్పరం దూషించుకునే ఉంటారు. అలాంటి ఇద్దరు బడా నేతలు ఒకే గూటి కిందకి చేరుకుంటే కుమ్ములాటలు జరగకుండా ఎలా ఉంటాయి మరి?
ఇప్పుడు గులాబీ గూటికి చేరిన పసుపు చొక్కాల వల్ల తెరాస నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కెసిఆర్ కి చెప్పలేని పరిస్థితి కొందరిది అయితే చెప్పినా కెసిఆర్ వాళ్ళ మాటని లెక్క చెయ్యని పరిస్థితి మరి కొందరిది. అద్దె గూటికి చేరిన వారికీ సొంత గూట్లో బ్రతుకుతున్న వారికీ మధ్య జరిగే ఇలాంటి గ్రూపు రాజకీయాలు అంతర్గత గొడవలు మనం నిత్యం చూస్తున్నవే. ఈ మధ్యే నూతనంగా ఏర్పడిన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఇప్పుడు ఈ గొడవలకు వేదిక అయ్యింది. ఇక్కడ నేతల మధ్య ఉన్న అంతర్గత పగ తెరాసా లో సెగలు పుట్టించేలా ఉందని నేతలు బాగా చర్చించుకుంటున్నారు. జంపింగ్ కాండిడేట్స్ కు విలువ ఇవ్వాలని కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాలు తెరాసా నేతలలో తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయి. పసుపు జెండాని వదిలేసి గులాబీ కారెక్కిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్త గూడెం కి ప్రాతినిధ్యం వహిస్తూ తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్తగూడెంజిల్లా తెరాస ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో క్షణం కూడా పడని పరిస్థితి. ఆ ఇద్దరూ పాము ముంగిసల్లా వ్యవహరిస్తున్నారన్నది టాక్ .
కొత్త జిల్లాల ఏర్పాటు విషయం లో కూడా తుమ్మల ఎక్కువ గానే జోక్యం చేసుకుని హవా సాగించారు. ఏర్పాట్లు అన్నీ తన చేతుల మీదుగానే చేశారు. ఆ వేడుకలకు జలగం హాజరు కాలేదని అందరికీ తెలిసిందే. తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని పనులకు జలగం డుమ్మా కొట్టడం పార్టీ వర్గాలలో అంతర్గత చర్చలకు దారి తీస్తుంది. వీళ్ళ మధ్య ఉన్న వర్గ పోరు ఆధిపత్య పోరు వల్ల తుమ్మల సారధ్యంలో జరుగుతున్న జిల్లా సమీక్ష సమావేశాలకు కూడా జలగం ఎగనామం పెడుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే తుమ్మలకి కెసిఆర్ సపోర్ట్ ఎలా ఉందో జలగం కి కూడా కేటీర్ సపోర్ట్ కూడా అంతే బలంగా ఉంది. ఇలా ఉంటే ఇంకేం తగ్గుతారు
ఈ ఇద్దరి గొడవ గనుక టీవీ సీరియల్ లా ఇలాగే కొనసాగితే ఈ తరుణం తెలుగుదేశానికి వరంగా మారొచ్చు. కొత్త గూడెం జిల్లాలో సైకిల్ స్పీడ్ పెంచి తెలుగుదేశం జెండా ఊపు అందుకోవచ్చని రాజకీయ వర్గాల అభిప్రాయం.
Leave a Reply